ఒకే రోజు, ఒకే ఎయిర్ పోర్టు.. గంటల వ్యవధిలో కూలిన 2 ఫ్లైట్లు!

  • టాంజానియా ఎయిర్ పోర్టులో రెండు ప్రమాదాలు
  • రెండు విమానాల్లోనూ చెరో 30 మంది ప్యాసింజర్లు, ముగ్గురు సిబ్బంది
  • ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది క్షేమం.. తీవ్రంగా దెబ్బతిన్న విమానాలు
టాంజానియా దేశంలో ఒకే రోజు, ఒకే ఎయిర్ పోర్టులో రెండు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గంటల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదాలు రెండూ ల్యాండ్ అయ్యే క్రమంలోనే జరగడం గమనార్హం. రెండు విమానాల్లోనూ 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉండడం ఇంకో విశేషం. ఈ ప్రమాదాల్లో విమానాలు బాగా దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదని అధికారులు చెప్పారు.

టాంజానియాలోని కికోబోగా ఎయిర్ పోర్టులో కిందటి మంగళవారం ఈ ప్రమాదాలు జరిగాయి. జాంజిబార్ ఎయిర్ పోర్టు నుంచి 30 మంది ప్యాసింజర్లు, ముగ్గురు సిబ్బందితో యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం కికోబోగాకు బయలుదేరింది. కికోబోగా విమానాశ్రయంలో దిగుతుండగా ఫ్లైట్ రన్ వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్ వే పై కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. విమానానికి బాగా డ్యామేజ్ అయినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ఉదయం జరిగిన ఈ ప్రమాదం నుంచి కికోబోగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఇంకా తేరుకోనేలేదు.. ఇంతలో మరో ప్రమాదం జరిగింది. దాదాపు ఆరు గంటల తర్వాత కికోబోగా నుంచి జాంజిబార్ వెళ్లేందుకు మరో విమానం సిద్ధమైంది. 30 మంది ప్రయాణికులను జాంజిబార్ చేర్చేందుకు పైలట్ మరో ఇద్దరు సిబ్బంది రెడీ అయ్యారు. రన్ వే పై స్పీడ్ అందుకున్నాక గాల్లోకి లేవాల్సిన విమానం రన్ వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్ ను ఢీ కొట్టింది. నోస్ గేర్ కొలాప్స్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కూడా ప్రయాణికులు, సిబ్బంది సేఫ్.. విమానం మాత్రం బాగా దెబ్బతిందని వివరించారు.


More Telugu News