సాగర్ ప్రాజెక్టు మొత్తం కేంద్రం అధీనంలోకి..!

  • ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం
  • సీఆర్ పీఎఫ్ బలగాల రాకతో వెనుదిరిగిన పోలీసులు
  • కుడి కాలువ ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై నెలకొన్న వివాదం కొలిక్కి రానుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతిలో పెట్టాలన్న ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకరించాయి. దీంతో ప్రాజెక్టు వద్దకు సీఆర్ పీఎఫ్ బలగాలు చేరుకుంటున్నాయి. తెల్లవారుజామునుంచి ఒక్కో పాయింట్ ను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి. 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు వేసిన ముళ్ల కంచెను తొలగించి మధ్యాహ్నానికి ప్రాజెక్టు మొత్తాన్ని స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు, సాగర్ కుడి కాలువ ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.

గురువారం తెల్లవారుజామున వందలాదిగా ప్రాజెక్టు పైకి చేరుకున్న ఏపీ పోలీసులు.. అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, తెలంగాణ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన విషయం తెలిసిందే. పదమూడవ గేటు వరకు తమ పరిధిలోకే వస్తుందంటూ కంచె వేసి ఆక్రమించారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆన్ లైన్ లో సమావేశమయ్యారు. ప్రాజెక్టుపై గత నెల 28 కి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వ అధికారులను కోరారు.

డ్యాం నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుందని, సీఆర్ పీఎఫ్ బలగాలతో పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని అజయ్ కుమార్ భల్లా చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.


More Telugu News