హైకమాండ్ నేతల అభిప్రాయాలు తీసుకుంటే అందరూ రేవంత్‌కే ఓటేస్తారు: మల్లు రవి

  • మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డిని సీఎంగా సూచిస్తామన్న కాంగ్రెస్ సీనియర్
  • కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని వెల్లడి
  • రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పార్టీ కోసం కష్టపడ్డారని ప్రస్తావించిన మల్లు రవి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం ఆసక్తికర చర్చకు దారితీసింది. హస్తం పార్టీ గెలిస్తే సీఎం ఎవరనే చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డిని సీఎంగా తాము సూచిస్తామని తెలిపారు. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. సీఎం ఎంపిక విషయంలో హైకమాండ్ నేతల అభిప్రాయాలను కోరితే అందరూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే ఓటు వేస్తారని భావిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇద్దరూ పార్టీ కోసం కష్టపడ్డారని, జనం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని మల్లు రవి అన్నారు. రేవంత్ పాదయాత్రలు, జనసభలతో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారని, భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు తాము ప్రజల తీర్పును గౌరవించామని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరచొద్దని బీఆర్ఎస్ నేతలకు ఆయన సూచించారు. ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌ పార్టీకే సానుకూలంగా ఉన్నాయని, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మల్లు రవి దీమా వ్యక్తం చేశారు.


More Telugu News