ముంచుకొస్తున్న తుపాను.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

  • రేపు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
  • నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
  • తుపాను తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక
  • తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రేపు తుపానుగా మారనుంది. తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని చెప్పారు. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నెల్లూరు - మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

తుపాను ప్రభావంతో సముద్ర తీరంలో అలలు ఎగసిపడతాయని, 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.  

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తుపానుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ, తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని చెప్పారు. జిల్లాల స్థాయిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. మరోవైపు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధమయ్యాయి. నౌకలను, అత్యవసర సామగ్రిని నౌకాదళ కమాండ్ సిద్ధం చేసింది. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో నిత్యావసర సరకులకు లోటు రాకుండా పౌరసరఫరాల విభాగం చర్యలు తీసుకుంటోంది.


More Telugu News