ఈ డ్రామా కూడా కోడి కత్తి వ్యవహారం లాంటిదే: లోకేశ్

  • కాకినాడలో లోకేశ్ యువగళం
  • పాదయాత్రకు 214వ రోజు
  • సర్పవరంలో లోకేశ్ బహిరంగ సభ
  • సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కాకినాడ నగరంలో విశేష స్పందన లభించింది. యువగళం జెండాలు చేతబూని టీడీపీ-జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు. కాకినాడ రూరల్ సర్పవరంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ... సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. 

నాగార్జునసాగర్ వద్ద డ్రామా కూడా కోడి కత్తి వ్యవహారం లాంటిదేనని ఎద్దేవా చేశారు. "క‌ర‌వుతో రైతులు అల్లాడుతుంటే క‌నీసం స‌మీక్ష కూడా చేయ‌ని జ‌గ‌న్ కి తెలంగాణ పోలింగ్ రోజు రైతులు గుర్తొచ్చారు, సాగ‌ర్ ఆయ‌క‌ట్టు రైతుల‌పై ప్రేమ పొంగి పొర్లింది... పోలీసుల్ని పంపి నాగార్జున సాగ‌ర్ పై శాంతిభ‌ద్రత‌ల స‌మ‌స్య క్రియేట్ చేయించాడు. ఇది కూడా మరో కోడిక‌త్తి, బాబాయ్ గుండెపోటు డ్రామా లాంటిదే" అంటూ లోకేశ్ విమర్శించారు.

జగన్ కు మమ్మల్ని చూస్తే భయం!

జగన్ కి భయం పట్టుకుంది. జగన్ కి చంద్రబాబుని చూస్తే భయం, పవన్ కళ్యాణ్ ని చూస్తే భయం, లోకేశ్ ని చూస్తే భయం. చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం చూస్తే జగన్ కి భయం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే జగన్ కి భయం, లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తే జగన్ కి భయం. సొంత అమ్మని చూసినా జగన్ కి భయమే... సొంత చెల్లిని చూసినా జగన్ కి భయమే. ఆఖరికి ప్రజల్ని చూసినా జగన్ కి భయమే... అందుకే పరదాలు కట్టుకొని దొంగలా వెళతాడు. తెలుగుదేశం ఘన చరిత్ర ఉన్న పార్టీ, వైసీపీ గజదొంగల పార్టీ.

కోడికత్తి వారియర్స్ అని పేరు పెట్టండి!

జ‌గ‌న్ ఐపీఎల్ టీము పెడ‌తామంటున్నాడు... దీనికి కోడిక‌త్తి వారియ‌ర్స్ అని పేరు పెడితే బాగుంటుంది. సీనియ‌ర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అర‌గంట స్టార్ అంబ‌టి, గంట‌ స్టార్ అవంతి, ఆల్ రౌండ‌ర్ గోరంట్ల మాధ‌వ్, రీల్ స్టార్ భ‌ర‌త్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్ట‌ర్ బియ్యం మ‌ధు... అబ్బో మామూలు టీము కాదు ఇది! 

అన్ని కార్యక్రమాలు తుస్సే!

ఈ మధ్య వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన అన్ని కార్యక్రమాలు తుస్సుమన్నాయి. జగన్ ఇప్పుడో కొత్త స్కీం తెచ్చాడు... దాని పేరు 'ఆడుదాం ఆంధ్రా' అంట. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్న జగన్ ఇపుడు 'ఆడుదాం ఆంధ్రా' అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. 

నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ఇండోర్ స్టేడియం అన్నాడు. క్రికెట్ అకాడ‌మీలు ఏర్పాటు చేస్తానని అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. కానీ ప్లేయర్స్ నుండి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. స్టేడియంలు, గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ చేయ‌డానికి వచ్చినవాళ్లని, ఆడేందుకు వ‌చ్చిన‌వాళ్ల‌ని ఫీజులు క‌ట్ట‌క‌పోతే రావొద్దంటూ త‌రిమేస్తున్నాడు ఈ జ‌గ‌న్. కేంద్ర ప్రభుత్వ 'ఖేలో ఇండియా' కార్యక్రమానికి తెలుగు పేరు పెట్టి బిల్డప్ ఇస్తున్నాడు.

రూరల్ లో అవినీతి ఫుల్!

కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని కన్నబాబుని ప్రజలు గెలిపించారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి కూడా అయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? మీ జీవితాలు ఏమైనా మారాయా? 

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు... అవినీతి ఫుల్లు. అవినీతిలో జగన్ ని మించిపోయేసరికి కన్నబాబు మంత్రి పదవి పోయింది. అందుకే ఆయన పేరు మార్చాను... కరప్షన్ కన్న. నియోజకవర్గాన్ని కేకులా కోసి కుటుంబ సభ్యులకు పంచేశారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ కరప్షన్ కన్న తండ్రి, తమ్ముడే చేస్తున్నారు.

ఏ పనిచేయాలన్నా కప్పం కట్టాల్సిందే

నియోజకవర్గంలో ఏ పని జరగాలి అన్నా కన్నబాబు తండ్రికో, తమ్ముడికో కప్పం కట్టాల్సిందే. సెంటు స్థలాల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఆయిల్ కంపెనీలు, లారీ ట్యాంకర్ల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. కరప్షన్ కన్న తమ్ముడి వేధింపులు తట్టుకోలేక ఈ మధ్యే డాక్టర్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

కాకినాడను దోచేస్తున్న ద్వారంపూడి

కాకినాడ సిటీని అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించారు. కాకినాడ సిటీ ఏమైనా అభివృద్ధి చెందిందా? చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది. కాకినాడ సిటీని డ్రగ్స్, అవినీతి, భూకబ్జాలు, సెటిల్ మెంట్స్, మద్యం అక్రమ రవాణా, పేకాట క్లబ్స్ కి అడ్డాగా మార్చేశాడు చంద్రశేఖర్ రెడ్డి. 

అహంకారానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అచ్చం చంద్రశేఖర్ రెడ్డిలానే ఉంటుంది. అందుకే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు మార్చాను... దోపిడీ శేఖర్. గంజాయి, హెరాయిన్ డ్రగ్స్ అమ్మిస్తూ కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు. మున్సిపాలిటీ, స్మార్ట్ సిటీ నిధులు కాజేశాడు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులు ధ్వంసం చేశాడు.

వందల కోట్ల విలువైన భూములు స్వాహా

శశికాంత్ నగర్ లో పార్కుకి చెందిన 2 ఎకరాల భూమికి దొంగ పత్రాలు సృష్టించి బినామీలకు టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసి రూ.130 కోట్లు కొట్టేశాడు. కాకినాడ సూర్యారావుపేటలో 18 ఎకరాల భూమికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి కొట్టేశాడు. తండ్రి, తమ్ముడు ఆధ్వర్యంలో రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్మి కోట్లు కొట్టేస్తున్నారు. జగన్ కి బినామీ దోపిడీ శేఖర్. అధికారంలోకి వచ్చాక దోపిడీ చంద్రశేఖర్ రెడ్డి తిన్నది మొత్తం కక్కిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2944.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 18.2 కి.మీ.*

*215వ రోజు (2-12-2023) యువగళం వివరాలు*

*పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం*

*ఉదయం*

8.00 – కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – పవర్ జంక్షన్ వద్ద పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.30 – చిత్రాడ వద్ద పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.40 – చిత్రాడ పంచాయితీ ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం.

10.50 – చిత్రాడ మీ సేవా కేంద్రం వద్ద అడ్వకేట్లతో సమావేశం.

12.00 – పిఠాపురం పాదగయ వద్ద భోజన విరామం.

*సాయంత్రం*

4.00 – పిఠాపురం పాదగయ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.10 – పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రైవేట్ టీచర్లతో సమావేశం.

4.20 – పిఠాపురం హాస్పటల్ వద్ద బిసి సామాజికవర్గీయులతో సమావేశం.

4.30 – పిఠాపురం అంబేద్కర్ సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

4.40 – పిఠాపురం పాతబస్టాండు వద్ద టు వీలర్స్ మెకానిక్ లు, ముస్లింలతో భేటీ.

4.45 – పిఠాపురం ఉప్పాడ జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

రాత్రి 

7.00 – పిఠాపురం లారీ యూనియన్ వద్ద అగ్రవర్ణ పేదలతో సమావేశం.

8.00 – నవకండ్రవాడలో స్థానికులతో సమావేశం.

8.45 – కొండెవరం ఎస్సీ కాలనీలో స్థానికులతో మాటామంతీ.

8.50 – కొత్త ఇసుకపల్లి సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

10.00 – యండపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.

10.15 – యండపల్లి జంక్షన్ వద్ విడిది కేంద్రంలో బస.

******


More Telugu News