ఎగ్జిట్ పోల్స్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

  • ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి కంగారు పడవద్దన్న కేటీఆర్
  • ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతాడా? అని రేవంత్ రెడ్డి ప్రశ్న
  • తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు వేగంగా స్పందిస్తుందని వ్యాఖ్య
ఎగ్టిట్ పోల్స్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సర్వేలను ఎవరూ నమ్మవద్దని, 2018లోనూ ఇలాగే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయని, కానీ మనమే గెలిచామని కేటీఆర్ చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారుపడవద్దని, విజయం మనదే అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ తన అక్రమ సంపాదనతో ఎన్నికలను ప్రభావితం చేసి ఎక్కువకాలం అధికారంలో కొనసాగాలని అనుకున్నారని, కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనదన్నారు. తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు చాలా వేగంగా స్పందిస్తుందన్నారు. దీనిని ప్రజలు మరోసారి నిరూపించారన్నారు.

కామారెడ్డిలోనూ కాంగ్రెస్ శ్రేణులు కష్టపడ్డారని, కేసీఆర్‌ను ఓడగొడుతున్నారన్నారు. తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంతచారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను చూసి కేటీఆర్ బయటకు వచ్చి భయపెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ వచ్చి మాట్లాడాడు అంటే దుకాణం బంద్ అయినట్లే అన్నారు. కేసీఆర్ ముఖం చాటేశాడని, కేటీఆర్ ఇక ఇక్కడ ఉండరు.. అమెరికా వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. నేను ఏ పదవిలో ఉండాలనే విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.


More Telugu News