టీమిండియా కోచ్ గా ద్రావిడ్ కాంట్రాక్టు పొడిగింపుపై గంభీర్ స్పందన

  • టీమిండియా కోచ్ గా వరల్డ్ కప్ తో ముగిసిన ద్రావిడ్ పదవీకాలం
  • ద్రావిడ్ తో మాట్లాడి ఒప్పించిన బీసీసీఐ పెద్దలు
  • ద్రావిడ్ తో పాటు  సపోర్టింగ్ స్టాఫ్ కు కూడా కాంట్రాక్టు కొనసాగింపు
  • ఇది మంచి నిర్ణయం అంటూ గంభీర్ ప్రశంసలు
టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలాన్ని బీసీసీఐ పొడిగించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ తో ద్రావిడ్ పదవీకాలం ముగిసినప్పటికీ, కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ ను బీసీసీఐ పెద్దలు ఒప్పించారు. ద్రావిడ్ తో పాటు ఇతర సహాయక సిబ్బందిని కూడా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ద్రావిడ్ కాలపరిమితి ఎంత పొడిగించారన్నది తెలియలేదు కానీ, వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ద్రావిడ్ మార్గదర్శకత్వంలోనే బరిలో దిగుతుందన్నది ఖాయంగా తెలుస్తోంది. 

కాగా, ద్రావిడ్ కాంట్రాక్టు పొడిగింపుపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. మరి కొన్ని నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా కోచింగ్ బృందం మొత్తాన్ని కొనసాగించాలన్న నిర్ణయం బాగుందని అభినందించాడు. రాహుల్ ద్రావిడ్ మళ్లీ కోచ్ గా కొనసాగేందుకు అంగీకరించడం ప్రశంసనీయం అని పేర్కొన్నాడు. 

ఇకపై కూడా టీమిండియా అద్భుత ఆటతీరు కొనసాగుతుందని ఆశిస్తున్నానని తెలిపాడు. అయితే, టీ20 ఫార్మాట్ చాలా భిన్నమైనదని, ఇందులో ఎన్నో సవాళ్లు ఉంటాయని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఫార్మాట్ లోనూ ద్రావిడ్ బృందం అమోఘమైన రీతిలో ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్నట్టు వివరించాడు.


More Telugu News