తెరవెనక వారి పాత్ర అమోఘం.. కుటుంబ త్యాగాలపై ద్రవిడ్ భావోద్వేగ స్పందన

  • ద్రవిడ్, సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్‌ను పొడిగించిన బీసీసీఐ
  • జట్టుకు మరికొంతకాలంపాటు సేవలు అందించనున్న ద్రవిడ్ అండ్ కో
  • తనపై విశ్వాసం ఉంచిన బీసీసీఐ, ఆఫీస్ బేరర్స్‌కు ద్రవిడ్ కృతజ్ఞతలు
  • కుటుంబ త్యాగాలను గుర్తు చేసుకుని భావోద్వేగం
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో ద్రవిడ్ మరికొంతకాలంపాటు జట్టుకు సేవలు అందించనున్నాడు. కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన అనంతరం ద్రవిడ్ మాట్లాడుతూ.. తన కోసం కుటుంబం చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యాడు. తెరవెనక తనకు అండగా నిలుస్తున్న కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపాడు.

రెండేళ్లుగా టీమిండియాతో ప్రయాణం చిరస్మరణీయంగా మిగిలిందని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఈ కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినట్టు చెప్పాడు. జట్టులో మద్దతు, స్నేహం అసాధారణమని ప్రశంసించాడు. డ్రెస్సింగ్ రూములో ఈ సంస్కృతికి తాను గర్వపడుతున్నట్టు పేర్కొన్నాడు. తమ జట్టులో నైపుణ్యం, ప్రతిభ అసాధారణమని కొనియాడాడు. తమ సన్నాహాలు మొత్తం ఫలితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వివరించాడు. బీసీసీఐ, ఆఫీస్ బేరర్స్ తనపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. తన కుటుంబ త్యాగాలు, మద్దతుకు తాను ఎంతగానో అభినందిస్తున్నట్టు వివరించాడు. తెరవెనక వారిది అమూల్యమైన పాత్ర అని ద్రవిడ్ కొనియాడాడు.


More Telugu News