బాబ్బాబూ.. టీ20లను నువ్వే నడిపించవూ ప్లీజ్.. రోహిత్‌ను ఒప్పిస్తున్న బీసీసీఐ

  • సౌతాఫ్రికా పర్యటన కోసం నేడు మూడు జట్లను ప్రకటించనున్న బీసీసీఐ
  • నేడు సెలక్షన్ కమిటీని కలవనున్న బీసీసీఐ కార్యదర్శి జై షా
  • కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ టెస్టు జట్టులోకి వచ్చే అవకాశం
  • అజింక్య రహానేపై వేటు!
టీమిండియా సారథి రోహిత్‌శర్మ గత కొంతకాలంగా టీ20లకు దూరంగా ఉంటున్నాడు. దీంతో టీ20లకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. అతడు కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ స్కిప్పర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20లకు కూడా సారథ్యం వహించాలని రోహిత్‌ను ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. 

సౌతాఫ్రికా పర్యటన కోసం నేడు టీ20, వన్డే, టెస్టు జట్లను బీసీసీఐ ప్రకటించనుంది. వన్డే, టెస్టు జట్లకు సారథ్యం వహిస్తున్న రోహిత్‌ను టీ20లకు నేతృత్వం వహించాలని బీసీసీఐ ఒప్పించనుంది. అతడు కనుక అంగీకరిస్తే జట్ల ప్రకటన సమయంలో ఆ విషయాన్ని పేర్కొననుంది. ఇందులో భాగంగా నేడు బీసీసీఐ కార్యదర్శి జై షా ఢిల్లీలో అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని కలవనున్నారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ కోసం రోడ్‌ మ్యాప్ తయారుచేస్తారు. 

బీసీసీఐ విన్నపాన్ని మన్నించి రోహిత్ కనుక టీ20లకు సారథ్యం వహిస్తే సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ టెస్టు జట్టులోకి వచ్చే అవకాశం ఉండడంతో అజింక్య రహానేపై వేటు పడే అవకాశం ఉంది. చతేశ్వర్ పుజారాకు అవకాశాలు మిణుకుమిణుకుమంటున్నాయి.


More Telugu News