ఎన్నికలు వచ్చినప్పుడల్లా సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు.. నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్‌రెడ్డి ఫైర్

  • కొడంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న రేవంత్
  • నీటి సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శ
  • ఎందుకు ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని వ్యాఖ్య
టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నాగార్జునసాగర్ వద్ద ఏపీ పోలీసులు చేసిన హడావుడిపై స్పందిస్తూ... ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్ కు అలవాటేనని చెప్పారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవని... సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవని చెప్పారు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు... రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు.


More Telugu News