ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా

  • చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదు చేసిన సీఐడీ
  • ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్
  • తదుపరి విచారణ డిసెంబరు 1కి వాయిదా వేసిన హైకోర్టు 
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ డిసెంబరు 1కి వాయిదా వేసింది. 

అటు, అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపైనా హైకోర్టులో విచారణ జరిగింది. నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం డిసెంబరు 11కి వాయిదా వేసింది. 

అంతేకాదు, తనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంపై నారాయణ అల్లుడు వరుణ్ దాఖలు చేసిన పిటిషన్ కూడా నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. సీఐడీ లుకౌట్ సర్క్యులర్ ను సవాల్ చేస్తూ వరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. వరుణ్ సైతం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితుడిగా ఉన్నారు. 

వరుణ్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ సందర్భంగా... కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని సీఐడీ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు ముగిసిన పిమ్మట తదుపరి విచారణను హైకోర్టు డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News