మా దగ్గర స్టేడియాలే సరిగా లేవు.. అయినా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తాం: ఐస్‌ల్యాండ్ క్రికెట్ లేఖ వైరల్

  • 2025 చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనున్న పాక్
  • భారత్ వెళ్లే అవకాశం లేకపోవడంతో దుబాయ్‌‌కి మార్చే అవకాశం
  • ఐసీసీ చైర్మన్ స్పందన కోసం వేచి చూస్తున్నామన్న ఐస్‌ల్యాండ్ క్రికెట్
చాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే, భారత్-పాక్ మధ్య నెలకొన్న రాజకీయ పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో టీమిండియా పాక్‌లో పర్యటించే అవకాశం దాదాపు లేనట్టే. ఈ నేపథ్యంలో టోర్నీని దుబాయ్ తరలిస్తారన్న ప్రచారం జరుగుతోంది. 

ఈ ప్రచారంపై ఐస్‌ల్యాండ్ క్రికెట్ స్పందించింది. నవ్వు తెప్పించేలా ఐసీసీకి లేఖ రాసింది. తమ వద్ద సవాలు చేసే వాతావరణ పరిస్థితులు.. ప్రామాణిక స్టేడియాలు లేనప్పటికీ తాజా ఊహాగానాల నేపథ్యంలో ఆతిథ్య హక్కులు కోరుతున్నట్టు అందులో పేర్కొంది. తాము మడమ తిప్పే వ్యక్తులం కాదని, చాంపియన్స్ ట్రోఫీ 2025కు ఈ రోజు బిడ్ దాఖలు చేసినట్టు పేర్కొంది. దీనిపై ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్‌లే ఏం చెబుతారో వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. 

ఐస్‌లాండ్ క్రికెట్ ఇటీవల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచకప్‌లో దారుణ పరాభవం తర్వాత బాబర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ టోర్నీలో బాబర్ 9 మ్యాచుల్లో 40 కంటే తక్కువ సగటుతో 320 పరుగులు మాత్రమే చేశాడు. ‘కరోనా మహమ్మారి తర్వాత సాధారణ స్థితికి తిరిగి రానిది ఏది?’ అన్న సోషల్ మీడియా పోస్టుకు ఐస్‌లాండ్ క్రికెట్ బదులిస్తూ.. ‘బాబర్ బ్యాటింగ్ సగటు’ అని సమాధానమివ్వడం వైరల్ అయింది. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కుల కోసం మరోమారు నవ్వుతెప్పించేలా ఐసీసీకి లేఖ రాసింది.


More Telugu News