తల్లిదండ్రులను వేధిస్తున్న పిల్లలకు వైజాగ్ సీపీ వార్నింగ్

  • ఇంటికి వెళ్లి మరీ బుద్ధి చెప్పిన కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్
  • స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సీపీ విచారణ
  • మంగళవారం రాత్రి స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లిన రవిశంకర్
ఆస్తికోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకులకు వైజాగ్ సిటీ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ హెచ్చరికలు జారీ చేశారు. స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి బుద్ధి చెప్పారు. తల్లిదండ్రులను వేధిస్తే 3 నెలల జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఒక్కోసారి రెండింటినీ ఫేస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆస్తి కోసం వృద్ధులను వేధించవద్దని సూచించారు. తమ కడుపున పుట్టిన బిడ్డలే తమపై దురాగతాలకు పాల్పడితే ఆ తల్లిదండ్రులు పడే మానసిక వ్యధ అర్థమయ్యేలా కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ మేరకు పోలీస్ శాఖ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సీపీ రవిశంకర్ అయ్యన్నార్ మంగళవారం స్వయంగా విచారణ జరిపారు.

మంగళవారం రాత్రి ఆర్అర్ వెంకటాపురం, రామజోగిపేటలోని ఫిర్యాదుదారుల ఇంటికి సీపీ వెళ్లారు. వాస్తవాలను అడిగి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని, బాధితుల పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించాలని లోకల్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఆర్ వెంకటాపురంలో.. ఇళ్లు, ల్యాండ్ పేపర్లు, ఆర్డీ పుస్తకాలు, రూ.3 క్షల నగదు లాక్కుని కొడుకు తనను ఇంట్లో నుంచి గెంటేశాడని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. రామజోగి పేటలో మరో వృద్ధుడు మాట్లాడుతూ.. ఇంటిని తమ పేరు మీదికి మార్పించాలంటూ కొడుకులు, కోడళ్లు తనను వేధిస్తున్నారని సీపీతో చెప్పుకుని బాధపడ్డారు. ఈ రెండు కేసులలో బాధితుల పిల్లలకు సీపీ రవిశంకర్ అయ్యన్నార్ వార్నింగ్ ఇచ్చారు.



More Telugu News