తెలంగాణ ఎన్నికలు, పవన్ కల్యాణ్ ప్రచారం తీరుపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • మంచి చేస్తారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయాలన్న ఆర్జీవీ
  • తెలంగాణ ఎన్నికలపై పవన్ కు ఆసక్తి లేదని వ్యాఖ్య
  • పవన్ ప్రచారం చేస్తున్న తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్న వర్మ
తెలంగాణ అసెంబ్లీకి రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని... ఓటర్లు మనకు మంచి చేసే అభ్యర్థులనే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఎవరు డబ్బులిచ్చినా తీసుకోవాలని... కానీ, ఓటు మాత్రం మంచి చేస్తాడని నమ్మే వారికే వేయాలని చెప్పారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండి, ప్రజా సమస్యలు తెలిసిన వారికే ఓటు వేయాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్జీవీ మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు. 

రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను తాను చూడలేదని... అందుకే వాటి గురించి తాను మాట్లాడబోనని వర్మ తెలిపారు. ఇదే సమయంలో ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుండటంపై కూడా ఆయన స్పందించారు. బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తోందని... అయినప్పటికీ, ఈ ఎన్నికలపై జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆసక్తి లేదని చెప్పారు. పవన్ ప్రచారం చేస్తున్న విధానం చూస్తుంటేనే ఇది అర్థమవుతోందని అన్నారు. పవన్ కంటే కూడా కొల్లాపూర్ లో పోటీ చేస్తున్న బర్రెలక్క చాలా సీరియస్ గా ప్రచారం చేస్తోందని చెప్పారు. 


More Telugu News