ఆస్తిలో 99 శాతానికి పైగా దానం చేస్తూ అపరకుబేరుడు వారెన్ బఫెట్ వీలునామా!

  • మరణానంతరం తన ఆస్తిలో 99 శాతానికి పైగా కుటుంబ నిర్వహణలోని ట్రస్టులకు బదిలీ చేస్తూ విల్లు
  • విల్లు అమలుపరిచే బాధ్యతను తన ముగ్గురు కుమారులకు అప్పగింత
  • వారసత్వ సంపద ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్య
  • పెట్టుబడిదారీ వ్యవస్థలో లోపాలున్నా ఎన్నో అద్భుతాలు సాధించిందని వెల్లడి
అపరకుబేరుడు, వ్యాపారవేత్త వారెన్ బఫెట్ దాదాపుగా తన ఆస్తిమొత్తాన్ని విరాళమిచ్చేందుకు నిర్ణయించారు. తన మరణానంతరం ఆస్తిలో 99 శాతానికి పైగా తమ కుటుంబ నిర్వహణలోని చారిటబుల్ ట్రస్టులకు చెందేలా వీలునామా రాసినట్టు ఆయన తాజాగా వెల్లడించారు. ఈ విల్లును అమలుపరిచే బాధ్యత తన కుమారులు తీసుకున్నారని పేర్కొన్నారు. బర్క్‌షైర్ హాథ్‌వే సంస్థలో తనకున్న 1,600 క్లాస్ ఏ షేర్లను 24,00,000 క్లాస్ బీ షేర్లుగా మార్చినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థకు వెల్లడించారు. ఈ మేరకు షేర్ హోల్డర్లకు నవంబర్ 21న లేఖ రాశారు. 

పారంపర్య ఆస్తులన్నవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నవే అయినా ఇది మంచిది కాదని తనతో పాటూ తన కుమారుల విశ్వాసమని వారెన్ బఫెట్ తెలిపారు. మనిషిని సంపద దుష్టుడిగా లేదా ఉన్నతుడిగా మార్చదని కూడా వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ అది ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించిందన్నారు. తన ముగ్గురు కుమారులు ట్రస్టు వ్యవహారాలు చూస్తారని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు. మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు కాబట్టి, ఆస్తికి వారసులను ప్రకటించడం వివేకమైన చర్యగా పేర్కొన్నారు. 

వారెన్ బఫెట్ స్థాపించిన బర్క్‌షైర్ హాథ్‌వే ప్రస్తుత మార్కెట్ విలువ 780 బిలియన్ డాలర్లు. సంస్థలో మొత్తం 3.8 లక్షల మంది పనిచేస్తున్నారు. బఫెట్ అనంతరం కూడా సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని సంస్థ సీఈఓ విశ్వాసం వ్యక్తం చేశారు.


More Telugu News