భారతీయులకు 1.4 లక్షలకు పైగా స్టూడెంట్ వీసాలు.. అమెరికా ఎంబసీ మరో రికార్డు

  • రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసినట్టు ప్రకటించిన అమెరికా ఎంబసీ
  • అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్టు వెల్లడి
  • ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల స్టూడెంట్ వీసాలు, 8 మిలియన్ల బిజినెస్, టూరిస్టు వీసాలు జారీ చేశామని ప్రకటన
  • వీసా ప్రాసెసింగ్ ను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడి
భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఈమారు భారతీయులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ చేసింది. మునుపెన్నడూ లేని విధంగా 2022 అక్టోబర్-2023 సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 1.4 లక్షలకు పైగా స్టూడెంట్ వీసాలు జారీ చేసినట్టు రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 

అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల నాన్ ఇమిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్టు కూడా ఎంబసీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో సగానికి పైగా కార్యాలయాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో నాన్ ఇమిగ్రేషన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేశాయని తెలిపింది. అంతేకాకుండా, 2015 తరువాత అత్యధిక స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల బిజినెస్, టూరిస్టు వీసాలు జారీ చేసినట్టు కూడా ఎంబసీ తెలిపింది. 2017 తరువాత అత్యధికంగా 6 లక్షలకు పైగా స్టూడెంట్ వీసాలు ఇచ్చినట్టు కూడా పేర్కొంది. 

వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలతోనే ఇది సాధ్యమైందని అమెరికా ఎంబసీ పేర్కొంది. అమెరికా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి ఎంబసీకి రావాల్సిన అవసరం లేకుండానే వీసాలు జారీ చేయడం వంటివి లాభించాయని వెల్లడించింది. భవిష్యత్తులో వీసా జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.


More Telugu News