సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలి: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

  • దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడన ప్రాంతం
  • డిసెంబరు 2 నాటికి తుపానుగా మారే అవకాశం
  • పశ్చిమ వాయవ్య దిశగా పయనం
  • హెచ్చరిక జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ  
దక్షిణ అండమాన్ సముద్రంను ఆనుకుని మలక్కా జలసంధి వద్ద నిన్న ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ ఉదయానికి పశ్చిమంగా పయనించి దక్షిణ అండమాన్ సముద్రంపై కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 

ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని, ఆపై నవంబరు 30 నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. అక్కడ్నించి వాయవ్య దిశగా పయనిస్తూ డిసెంబరు 2 నాటికి తుపానుగా మారుతుందని వివరించింది. ఈ కారణాల వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక చేసింది. 

కాగా, ప్రైవేటు వాతావరణ సంస్థల నమూనాల ప్రకారం... ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను డిసెంబరు 4 నాటికి శ్రీహరికోట, చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు ఓ ప్రైవేటు వాతావరణ సంస్థ నమూనా వెల్లడిస్తోంది.


More Telugu News