తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం... ఇప్పటి నుంచి వీటిపై నిషేధం!
- సాయంత్రం 5 గంటలకు ముగిసిన ప్రచారం
- టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలు బంద్
- ఎన్నికలకు సంబంధించి నేతలు ఇంటర్వ్యూలు ఇవ్వరాదు
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. నేతలు, అభ్యర్థులందరూ ఎక్కడికక్కడ ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి వచ్చింది. ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. పత్రికల్లో వేసే ప్రకటనలకు కూడా మోడల్ కోడ్ మీడియా ముందస్తు అనుమతి ఉండాలి. ప్రచారాలకు వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు స్థానికంగా ఉండకూడదు. ఇతర ప్రాంతాల వారు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. రేపు, ఎల్లుండి ఎన్నికలకు సంబంధించి రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు ఇవ్వరాదు. బల్క్ ఎస్ఎంఎస్ లు పంపకూడదు.