సిరీస్ కొట్టేయాలని భారత్.. పరువు కోసం ఆస్ట్రేలియా.. నేడు మూడో టీ20

  • ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు గువాహటిలో మూడో 20
  • వరుస ఓటములకు చెక్ పెట్టాలని యోచిస్తున్న కంగారూలు
  • ట్రావిస్ హెడ్‌ను తుది జట్టులోకి తీసుకుంటున్నఆసీస్
  • నేడు మ్యాచ్ ముగిశాక స్వదేశానికి స్మిత్
  • జట్టును మరింత బలంగా మార్చుకునే వ్యూహం
  • దూకుడుగా ఉన్న యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ 
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండింటిని గెలుచుకుని జోరుమీదున్న సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు.. నేడు గువాహటిలో జరగనున్న మూడో మ్యాచ్‌ను గెలుచుకుని సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రపంచ చాంపియన్లు భావిస్తున్నారు. 

ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌పై విజయం సాధించిన ఆసీస్ జట్టు ఆ తర్వాత నాలుగు రోజులకే భారత్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖలో జరిగిన మ్యాచ్‌లో జోష్ ఇంగ్లిష్ సెంచరీ, స్టీవ్ స్మిత్ అర్ధ సెంచరీ సాధించినా ఓటమి పాలైంది. తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రింకుసింగ్ షో ముందు కంగారూ జట్టు నిలవలేకపోయింది. రెండో టీ20లో విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆసీస్ రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. ట్రావిస్ హెడ్ ఇప్పటి వరకు బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో జట్టును మరింత బలంగా మార్చేందుకు హెడ్‌ను నేటి మ్యాచ్‌లో ఆడించాలని యోచిస్తోంది. 

గత రెండేళ్లుగా నాలుగంటే నాలుగు టీ20లు మాత్రమే ఆడిన హెడ్ నేటి మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది వేచి చూడాల్సిందే. మూడో టీ20 ముగియగానే బిగ్‌బాష్ లీగ్ కోసం స్మిత్ ఆసీస్ పయనమయ్యే అవకాశాలున్నాయి. సిడ్నీ సిక్సర్స్‌కు స్మిత్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్‌వెల్‌ సహా వారి టీ20 రెగ్యులర్లు అవసరం. రెండో టీ20లో మూడు ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకున్న సీన్ అబాట్ స్థానంలో తొలి టీ20లో మెరిసిన జాసన్ బెహ్రండార్ఫ్‌ను తిరిగి తీసుకోవాలని తహతహలాడుతోంది. రెండో మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు ఆడం జంపా, తన్వీర్ సంఘాతో ఆడిన ఆసీస్.. నేటి మ్యాచ్‌లోనూ అదే థియరీతో బరిలోకి దిగుతుందా? అన్నది చూడాలి. 

మరోవైపు, టీమిండియా మాత్రం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సమతూకంతో ఉంది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ వంటివారు దూకుడుగా ఆడుతూ రాణిస్తున్నారు. స్పిన్నర్లు అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్ పరుగులకు విజయవంతంగా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. అయితే, ప్రభావం చూపలేకపోతున్న అర్షదీప్ స్థానంలో అవేశ్‌ఖాన్ లాంటి ఆటగాడు తుది జట్టులోకి వస్తే జట్టు మరింత బలంగా మారుతుంది.


More Telugu News