ప్రధాని పర్యటన సందర్భంగా రమణ దీక్షితులు ట్వీట్.. కాసేపటికే డిలీట్
- తిరుమల పరిపాలనను ప్రభుత్వం దశలవారీగా నాశనం చేస్తోందని గౌరవ ప్రధానార్చకుడి ఫిర్యాదు
- తిరుమలను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అభ్యర్థన
- నెట్టింట వెల్లువెత్తిన విమర్శలతో పోస్ట్‌ను డిలీట్ చేసిన వైనం
టీటీడీ అధికారులపై ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. సోమవారం ప్రధాని మోదీ తిరుమల సందర్శన సందర్భంగా ఆయనను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘భారత ప్రధానికి శుభోదయం, తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనను హిందూయేతర అధికారి, రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా నాశనం చేస్తున్నారు. సనాతన ఆచారాలు, టీటీడీ పరిధిలోని పురాతన నిర్మాణాల ధ్వంసం సాగుతోంది. తిరుమలను వాటి నుంచి రక్షించి, హిందూ రాష్ట్రంగా అత్యవసరంగా ప్రకటించాలి. శ్రీవారి ఆశీస్సులు మీకుంటాయి’ అని పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రమణ దీక్షితులుపై నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. ముందుగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆ తరువాత కాసేపటికే రమణ దీక్షితులు తన పోస్ట్‌ను తొలగించారు.