పాండ్యా ముంబై ఇండియన్స్‌కి ఆడనుండడంపై తొలిసారి స్పందించిన గుజరాత్ టైటాన్స్

  • తొలి కెప్టెన్‌గా మొదటి రెండు సీజన్లలో చక్కటి సహకారాన్ని అందించాడని ప్రశంస
  • అతడి కోరికను గౌరవిస్తామని పేర్కొన్న గుజరాత్ టైటాన్స్ టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలింకి
  • కొత్త కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గత రెండేళ్లలో పరిణతి చెందాడని అభిప్రాయం
స్టార్ ఆల్-రౌండర్ హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ ఫ్రాంచైజీని వీడడంతో ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున ఆడడం ఖరారైంది. ‘ట్రేడ్ విండో’ ద్వారా ముంబై కొనుగోలు చేసింది. పాండ్యా అనూహ్యంగా జట్టుని వీడడంపై గుజరాత్ టైటాన్స్ తొలిసారి స్పందించింది. ఆ జట్టు డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్ తొలి కెప్టెన్‌గా ఫ్రాంచైజీకి రెండు అద్భుతమైన సీజన్లు అందించడంలో హార్దిక్ పాండ్యా తన సహకారం అందించాడని అన్నారు. ఒకసారి ఐపీఎల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకొని, మరోసారి రన్నరప్‌గా నిలిచామని ఒక ప్రకటనలో సోలంకి పేర్కొన్నాడు. తాను మొదట ఆడిన జట్టుకు తిరిగి వెళ్లాలని పాండ్యా కోరుకున్నాడని, అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని అన్నాడు. పాండ్యా భవిష్యత్ ప్రయత్నాలలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొన్నాడు.

ఇక గుజరాత్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న శుభ్‌మాన్ గిల్‌పై స్పందిస్తూ.. గత రెండేళ్లలో గిల్ ఎంతో పరిపక్వత కలిగిన ఆటగాడిగా రూపాంతరం చెందాడని సోలంకి విశ్వాసం వ్యక్తం చేశాడు.  గిల్ ఒక బ్యాటర్‌గా మాత్రమే కాకుండా జట్టుని నడిపించే వ్యక్తిగా కూడా పరిణతి సాధించడాన్ని తాము గుర్తించామని  అభిప్రాయపడ్డాడు. అతడి ఆటలో పరిపక్వత, నైపుణ్యం మైదానంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని, అందుకే యువ నాయకుడితో కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు చాలా సంతోషిస్తున్నామని అన్నారు. 

ఇదిలావుండగా హార్దిక్‌ పాండ్యాకు తిరిగి జట్టులోకి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ముంబై ఇండియన్స్ యాజమాన్యం పేర్కొంది. ‘హ్యాపీ హోమ్‌కమింగ్’ అని ముంబై ఇండియన్స్ యజమానులు నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇంటికి తిరిగి వచ్చిన హార్దిక్‌ను స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నామని నీతా అంబానీ పేర్కొన్నారు. ముంబై ఇండియన్స్‌లో యువ ఆటగాడు ఇప్పుడు టీమిండియా స్టార్‌గా చాలా ఎత్తు ఎదిగాడని ప్రశంసలు కురిపించారు. అతడికి, ముంబై ఇండియన్స్‌కి మంచి భవిష్యత్ ఉంటుందని ఆమె అభిలషించారు. ఇక ఆకాశ్ అంబానీ స్పందిస్తూ..  పాండ్యా ఏ జట్టుకైనా బ్యాలెన్స్ ఇవ్వగలడని అన్నారు. ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ మొదటి ప్రయాణం విజయవంతమైందని, రెండవ దశలో మరింత విజయాన్ని సాధిస్తాడని తాము ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News