కాంగ్రెస్ నేతలు నా రూమ్‌కు వచ్చి బెదిరించారు: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఆరోపణలు

  • మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కాంగ్రెస్ నాయకులు తన హోటల్ గదికి వచ్చి బెదిరించారన్న ప్రీతిరెడ్డి
  • మహిళలు, పురుషులు... మొత్తం పాతికమంది వచ్చారని ఆరోపణ 
  • కాంగ్రెస్ ఓడిపోతుందని అర్థమై వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శ 
తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు బెదిరింపులకు పాల్పడ్డారని రాష్ట్ర మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రీతిరెడ్డి దాదాపు నెల రోజులుగా మేడిపల్లిలోని ఎస్‌వీఎం గ్రాండ్ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో దాదాపు పాతికమంది కాంగ్రెస్ నాయకులు తాను బస చేస్తున్న హోటల్ వద్దకు వచ్చి తనను బెదిరించారన్నారు. ఇందులో మహిళలు, పురుషులు ఉన్నట్లు చెప్పారు. హోటల్లో తాను ఉంటున్న గదికి వచ్చి బెదిరించారని ఆరోపించారు.

తనను నోటికి వచ్చినట్లు తిడుతూ భయపెట్టారని అన్నారు. వాళ్లు తనను ఎందుకు తిడుతున్నారో కూడా అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని వారికి అర్థమైందని, అందుకే ఏం చేయలేక బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు సరికాదన్నారు. ఇలా రౌడీయిజం... గూండాయిజం చేసేవారికి ఓట్లు వేయవద్దని ప్రీతిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News