ఏపీలో ఓటర్ల జాబితా అవకతవకలపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

  • ఓటరు జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు
  • సుప్రీంకోర్టులో పిల్ వేసిన సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ
  • వాలంటీరు వ్యవస్థను రద్దు చేయాలని విజ్ఞప్తి
ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. 

వాలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. వాలంటీరు వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. 

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ సుప్రీంకోర్టును కోరింది. ఏపీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించిందని ఆరోపించింది. జీవో నెం.104ను సస్పెండ్ చేయకపోతే ప్రజలకు తీరని నష్టమని వెల్లడించింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ప్రాథమిక, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ తన పిటిషన్ లో వివరించింది.


More Telugu News