తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు ఇదే నా విన్నపం: పోసాని కృష్ణమురళి

  • సెటిలర్లను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారన్న పోసాని
  • తెలంగాణలో రెండు రాష్ట్రాల వారు అన్నదమ్ముల్లా ఉన్నారని వ్యాఖ్య
  • అందరూ బీఆర్ఎస్ కి ఓటు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎం చేసుకోవాలని విన్నపం
తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కొనియాడారు. రాష్ట్రంలో ఏపీ, తెలంగాణ ప్రజలంతా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందని ప్రశంసించారు. తక్కువ కాలంలోనే న్యూయార్క్ ను తలదన్నేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. 

మిషన్ భగీరథ గురించి ఎంత చెప్పినా తక్కువేనని... నెహ్రూ నుంచి ఈరోజు వరకు ఏ ప్రధాని కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేయలేదని పోసాని అన్నారు. రాష్ట్రంలో ఏ ట్యాప్ తిప్పినా తాగునీరు వస్తోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంటున్నారే కానీ... అవినీతి ఎక్కడ జరిగిందనేని ఇంతవరకు నిరూపించలేకపోయారని విమర్శించారు. మేడి గడ్డ బ్యారేజీలో ఒక్క పిల్లర్ కుంగిపోతే ఊళ్లు ఎలా మునిగిపోతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో చెరువులన్నీ నీటి కళను సంతరించుకున్నాయని... ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలు కనిపిస్తున్నాయని చెప్పారు. 

రాష్ట్రంలో ఉన్న సెటిలర్స్ ను కేసీఆర్ బిడ్డల మాదిరి చూసుకుంటున్నారని పోసాని అన్నారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు తన విన్నపం ఒక్కటేనని... కులమతాలకు అతీతంగా ఆలోచించి, మనల్ని కాపాడుతున్నది ఎవరనే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు. అందరూ బీఆర్ఎస్ కు ఓటు వేసి కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.


More Telugu News