పాక్ ఓటమిని భారత్‌ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడంపై వసీం అక్రమ్, గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఒకరి ఓటమిని ఆస్వాదించడంలో అర్థంలేదని ఖండించిన అక్రమ్, గంభీర్
  • భారత్, పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్‌ వైఖరిపై మండిపడిన దిగ్గజాలు
  • ఇలాంటి వైఖరిని విడనాడాలని సూచించిన మాజీలు
క్రికెట్ అయినా, ఇతర క్రీడల్లోనైనా భారత్ ఓడిపోతే పాకిస్థాన్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం.. పాక్ పరాజయం పాలైతే ఇండియా ఫ్యాన్స్ వేడుక చేసుకోవడం కామన్‌గా మారిపోయింది. అయితే ఈ వైఖరి అమోదయోగ్యమైనది కాదని, ఒకరి ఓటమిని మరొకరు ఆస్వాదించడంలో అర్థం లేదని మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, గౌతమ్ గంభీర్ ఖండించారు. 

భారత్, పాకిస్థాన్ ఫ్యాన్స్ ఒకరి ఓటములను మరొకరు సెలబ్రేట్ చేసుకునే విధానాన్ని ముగించాలని వసీం అక్రమ్ సూచించాడు. తాను ఎవరి పేరు ఎత్తడం లేదని, కానీ రెండు దేశాల్లోని కొంతమంది ప్రముఖ వ్యక్తులు కొన్నిసార్లు ఇలాంటి విషయాలకు ఆజ్యం పోస్తుంటారని అక్రమ్ మండిపడ్డాడు. ఎవరి దేశానికి వారు భక్తులుగా ఉంటే చాలు అని, ఆ విషయాన్ని అక్కడితోనే ముగించాలని సూచించాడు. ఇది కేవలం ఆట అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడతారని అక్రమ్ అన్నాడు.

అక్రమ్ అభిప్రాయాన్ని గౌతమ్ గంభీర్ కూడా సమర్థించాడు. పాకిస్థాన్ ఓటమిని భారతీయులు జరుపుకోవడం విచిత్రంగా ఉందని అన్నాడు. ఇతర జట్టు ఓటములను ఆస్వాదించడం కంటే తమ జట్టు విజయాలను సెలబ్రేట్ చేసుకోవడంపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్‌కి సూచించాడు. ఇతర జట్ల ఓటములను సంబరాలు చేసుకోవడంలో అర్థం లేదని అన్నాడు. పాకిస్థాన్ ఓడిపోయినప్పుడు ఇండియాలో.. భారత్ ఓడిపోయినప్పుడు పాకిస్థాన్‌లో సంబరాలు చేసుకునే వైఖరి ప్రతికూలమైనదని ఖండించాడు. కనీసం క్రీడలలోనైనా ఈ విధానం మారాలని సూచించాడు. ఇతరుల దుఃఖంలో ఆనందాన్ని వెతుక్కోకూడదని, దాని వల్ల ఏం లాభమని వ్యాఖ్యానించాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఇలాంటి పనులకు తెగపడుతున్నారని అన్నాడు. 

వన్డే వరల్డ్ కప్ 2023 లీగ్ దశలో పాకిస్థాన్‌పై టీమిండియా గెలుపొందడంతో భారత అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో పాకిస్థాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇందుకు వేదికలుగా మారాయి. ఈ పరిణామంపైనే వసీం అక్రమ్, గౌతమ్ గంభీర్ మాట్లాడారు.


More Telugu News