భారత్ ప్రపంచకప్ చేజార్చుకోడానికి కారణం ఇదే: అంబటి రాయుడు
- పిచ్ నెమ్మదిగా ఉండటం భారత్ ఓటమికి కారణమన్న అంబటి రాయుడు
- పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా అనుకూలించే పిచ్ ఉండాలని వ్యాఖ్య
- టాస్‌కు ప్రాధాన్యం ఉండకూడదని స్పష్టీకరణ
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమికి పిచ్ నెమ్మదిగా ఉండటమే కారణమని టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా ఆడిన పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. పిచ్ ఇలా తయారు చేయాలన్న ఆలోచన ఎవరిదో నాకు తెలియదు. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా అనుకూలించే పిచ్ తయారు చేయాల్సింది. ఎందుకంటే ఆసిస్‌తో పోలిస్తే భారత్ చాలా బలంగా ఉంది. కానీ తుది పోరులో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. ఏ జట్టునైనా ఓడించగలిగే సత్తా భారత్‌కు ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో పిచ్ తొలి నుంచి ఆఖరి దాకా ఒకేవిధంగా ఉండటమే మంచిది. టాస్‌కు ప్రాధాన్యం ఉండకూడదు. ఫైనల్లో పిచ్‌ను ప్రణాళిక ప్రకారమే ఇలా చేసి ఉంటే అది తెలివి తక్కువతనమే’’ అని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు.