రేవంత్ రెడ్డి కామారెడ్డితో పాటు కొడంగల్‌లోనూ ఓడిపోతారు: కేటీఆర్ జోస్యం

  • బీసీ బిడ్డ గొంతు కోసి రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారని విమర్శలు
  • కాంగ్రెస్, బీజేపీ నాయకులు రోజుకో డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం
  • కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు... కరెంట్ ఉంటే కాంగ్రెస్ రాదని చురకలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డితో పాటు కొడంగల్‌లోనూ ఓడిపోతారని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. రైతుబంధు దుబారా అని, మూడు గంటలే విద్యుత్ అని రేవంత్ రెడ్డి అనలేదా? అని ప్రశ్నించారు. బీసీ బిడ్డ గొంతు కోసి రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. 

నర్సాపూర్‌లో నిర్వహించిన రోడ్డుషోలో కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇక్కడకు భారీగా తరలివచ్చిన జనాలను చూస్తే తమ అభ్యర్థి సునీతారెడ్డి గెలుపు ఖాయమని అర్థమవుతోందన్నారు.

2014 ముందు కరెంట్ కోసం పడ్డ కష్టాలు గుర్తుంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ ఉండదు... కరెంట్ ఉంటే కాంగ్రెస్ ఉండదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కౌలు రైతుకు రైతుబంధు ఇవ్వాలని కాంగ్రెస్ అనలేదా? అని ప్రశ్నించారు. 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.73,000 కోట్లు వేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణకు నష్టంచేసిన వారు ఒక్క అవకాశం అంటూ వచ్చి అడుగుతున్నారని మండిపడ్డారు. 

కేసీఆర్ హయాంలో రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, ఎన్నో సంక్షేమాలు అందుతున్నాయన్నారు. సునీతారెడ్డిని గెలిపిస్తే నర్సాపూర్‌కు ఐటీ హబ్, పరిశ్రమలు తీసుకువస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామన్నారు. మదన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు.


More Telugu News