ఢిల్లీ కాలుష్యం అంతా హైదరాబాద్‌ను కమ్మేసింది: మంత్రి హరీశ్ రావు వ్యంగ్యం

  • ఢిల్లీ కాలుష్యాన్ని మరో మూడు రోజులు భరించాల్సి ఉంటుందని వ్యాఖ్య
  • ఢిల్లీ నుంచి వస్తున్న నేతలు మూడు రోజుల తర్వాత కనిపించరన్న హరీశ్ రావు
  • ఇప్పుడు నేను వెళ్త బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాడుకుంటున్నారన్న మంత్రి
ఢిల్లీ కాలుష్యాన్ని మరో మూడు రోజులు భరించాల్సి ఉంటుందని మంత్రి హరీశ్ రావు వ్యంగ్యం ప్రదర్శించారు. రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇటీవల ఢిల్లీ కాలుష్యం అంతా హైదరాబాద్‌ను కమ్మేసిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన.. వస్తున్న నేతలు అందరూ మూడు రోజుల తర్వాత కనిపించరని వ్యాఖ్యానించారు. ఈ మూడు రోజులు ఢిల్లీ కాలుష్యాన్ని భరించాల్సిందే అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలపై హరీశ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

బీఆర్ఎస్ మూడోసారి కచ్చితంగా గెలుస్తుందని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ కరెంట్ కోతలు తప్పవని హెచ్చరించారు. 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో గమనించాలన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు పాడుకునే వారమని, ఇప్పుడు నేను వెళ్త బిడ్డా సర్కారు దవాఖానాకు అని పాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిచాక పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News