ఆస్ట్రేలియా మీడియా తలపొగరు.. భారత క్రికెటర్లను అవమానించేలా ఫొటో

  • ట్రావిస్‌హెడ్ 11 మంది పిల్లలకు జన్మనిచ్చినట్టుగా ఫొటో
  • నర్సులు ఎత్తుకున్న పిల్లలకు భారత క్రికెటర్ల తలలు
  • లైక్ కొట్టిన పాట్ కమిన్స్, మ్యాక్స్‌వెల్
  • వారిద్దరినీ ఐపీఎల్ ఆడకుండా నిషేధించాలంటూ ఇండియన్ ఫ్యాన్స్ డిమాండ్
ఇప్పుడు ప్రపంచకప్ గెలిచిందని కాదు కానీ.. ఆస్ట్రేలియా జట్టుకు ఎప్పుడూ కాస్తంత తలపొగరు ఎక్కువే. ఇప్పుడు మరోమారు చాంపియన్లు కావడంతో అది మరోమారు తలకెక్కింది. ఇప్పుడది కాస్తా ఆస్ట్రేలియా మీడియాకూ పాకింది. బెటూటా అడ్వకేట్ అనే సెటైరికల్ వెబ్‌సైట్ ప్రచురించిన ఫొటోపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెట్ జట్టును అవమానించేలా ఉండడమే అందుకు కారణం.

ఆసీస్ క్రికెటర్లలో ఒకడైన ట్రావిస్ హెడ్ 11 మంది బిడ్డలకు జన్మనిచ్చినట్టుగా ఉంది. హెడ్ ఆసుపత్రి బెడ్‌పై ఉండగా చుట్టూ ఉన్న నర్సులు పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా ఆ ఫొటోను ప్రచురించారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. వారి చేతుల్లో ఉన్న బిడ్డలకు ఇండియన్ క్రికెటర్ల తలలను మార్ఫింగ్ చేయడం వివాదాస్పదమైంది. కోహ్లీ, రోహిత్‌శర్మ, బుమ్రా, షమీ, జడేజా సహా మొత్తం 11 మంది ఆటగాళ్లను మార్ఫింగ్ చేశారు. ఈ ఫొటోకు ఓ తలతిక్క క్యాప్షన్ కూడా ఆ మ్యాగజైన్ తగిలించింది.  ‘సౌత్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ 11 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించాడు’’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు కంగారూ కెప్టెన్ పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటివారు లైక్‌కొట్టడం మరింత ఆశ్చర్యపరిచింది. 

బెటూటా అడ్వకేట్ ప్రచురించిన ఈ ఫొటోపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ఆటన్నాక గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని అటకెక్కించి, గర్వం తలకెక్కించుకుని ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు. మ్యాగజైన్ ప్రచురించిన ఫొటోకు లైక్ కొట్టిన మ్యాక్స్‌వెల్, కమిన్స్‌ను ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News