అండర్-19 ఆసియా కప్ కు భారత జట్టు ఎంపిక... ఇద్దరు హైదరాబాద్ కుర్రాళ్లకు చోటు

  • డిసెంబరు 8 నుంచి అండర్-19 ఆసియా కప్
  • యూఏఈ వేదికగా ఈవెంట్
  • 15 మందితో భారత కుర్రాళ్ల జట్టు ఎంపిక
  • హైదరాబాదీ క్రికెటర్లు అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ లకు స్థానం
యూఏఈ వేదికగా డిసెంబరు 8 నుంచి 17వ తేదీ వరకు అండర్-19 ఆసియా కప్ జరగనుంది. ఈ ఈవెంట్ కోసం నేడు భారత కుర్రాళ్ల జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఇద్దరు హైదరాబాదీలు కూడా ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చెందిన ఆరవెల్లి అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ కూడా జాతీయ అండర్-19 టీమ్ కు ఎంపికయ్యారు. 

వీరు ఇటీవల నిర్వహించిన చాలెంజర్ ట్రోఫీ ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. అవనీశ్ రావు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కాగా... మురుగన్ అభిషేక్ ఆల్ రౌండర్. వీరిద్దరూ నవంబరు 3 నుంచి 9 వరకు గువాహటిలో నిర్వహించిన అండర్-19 చాలెంజర్ ట్రోఫీలో సత్తా చాటారు. 

కాగా, 15 మందితో అండర్-19 భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు... ముగ్గురిని స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురు కూడా జట్టుతో పాటే ఉంటారు.  వీరితో పాటు నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. అయితే వీరు జట్టుతో పాటు వెళ్లరు. ఎవరైనా ఆటగాడు గాయపడితే ఈ నలుగురిలోంచి ఎంపిక చేస్తారు. ఆసియా కప్ లో పాల్గొనే భారత అండర్-19 జట్టుకు ఉదయ్ సహారన్ (పంజాబ్) కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

జట్టు వివరాలు...
ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), ఆరవెల్లి అవనీశ్ రావు (వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, అర్షిన్ కులకర్ణి, రాజ్ లింబానీ, ఆదర్శ్ సింగ్, ఆరాధ్య శుక్లా, రుద్ర మయూర్ పటేల్, ధనుష్ గౌడ, సచిన్ దాస్, ఇన్నేశ్ మహాజన్ (వికెట్ కీపర్), ప్రియాంశు మోలియా, ముషీర్ ఖాన్.

ట్రావెలింగ్ స్టాండ్ బై ఆటగాళ్లు...
ఎండీ అమన్, ప్రేమ్ దేవకర్, అన్ష్ గోసాయ్

అదనపు రిజర్వ్ ఆటగాళ్లు...
పి.విఘ్నేశ్, కిరణ్ చోర్మలే, దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్

కాగా, ఆసియా కప్ లో ఆడే భారత అండర్-19 జట్టుకు ఎంపికైన  హైదరాబాద్ క్రికెటర్లు అవనీశ్ రావు, మురుగన్ అభిషేక్ లకు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అర్శినపల్లి అభినందనలు తెలిపారు. వారిద్దరూ టోర్నీలో రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత జట్టుకు ఎంపికయ్యేందుకు వారిద్దరూ అర్హులేనని కొనియాడారు.


More Telugu News