నేడు, రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

  • శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
  • బేగంపేట్ - రాజ్‌భవన్ మధ్య ఆయా సమయాల్లో ఆంక్షలు ఉంటాయని ప్రకటన
  • శని, ఆది, సోమ వారాల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ప్రధాని మోదీ
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింపునకు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మరింత జోరు పెంచాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు బీఆర్ఎస్ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తుండగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులను రంగంలోకి దించుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. శనివారం (నేడు) సాయంత్రం ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు. నగరంలో ఆయన ప్రయాణించే ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా శని, ఆదివారాల్లో (నవంబర్ 25, 26) హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ప్రధాని మోదీ శనివారం సాయత్రం 5:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వై జంక్షన్‌, పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా ప్రధాని రాజ్‌భవన్‌ చేరుకోనున్నారు. దీంతో  ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక 26న ఆదివారం ఉదయం 10:35 - 11:05 మధ్య ప్రధాని రాజ్‌భవన్‌ నుంచి ఎంఎంటీఎస్‌, యశోద ఆసుపత్రి, బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ సమయాల్లో కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్రాఫిక్‌ దారి మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని హైదరాబాద్ పోలీసులు సూచించారు. ప్రధాని షెడ్యూల్‌కు అనుగుణంగా శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ జీ.సుధీర్‌ బాబు వెల్లడించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

రాష్ట్రంలో మోదీ షెడ్యూల్ ఇలా..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు దుండిగల్‌ ఏయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు జరిగే కామారెడ్డిలో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసి ఆదివారం దుబ్బాక, నిర్మల్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. షెడ్యూల్ ప్రకారం 27న మహబూబాబాద్, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇక సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షోతో ప్రధాని పర్యటన ముగియనుంది.


More Telugu News