వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన టీమిండియా ఆటగాళ్లకు కపిల్ దేవ్ సందేశం

  • కప్ గెలవలేకపోయినా అద్భుతంగా ఆడారంటూ భారత ఆటగాళ్లకి మాజీ దిగ్గజం ప్రశంస
  • టీమిండియా ఇంత బాగా ఆడినా కప్ రాకపోవడం నిరాశ, నిరుత్సాహానికి గురి చేసిందని వెల్లడి
  • పొరపాట్ల నుంచి నేర్చుకుని ఇంకా మెరుగ్గా రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేసిన కపిల్ దేవ్
వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి భారత క్రికెట్ అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉంది. సెమీఫైనల్ వరకు అన్ని మ్యాచ్‌లను అద్భుతంగా గెలిచిన టీమిండియా ఫైనల్లో భంగపాటుకు గురవ్వడాన్ని మరచిపోలేకపోతున్నారు. ఇక టీమిండియా ఆటగాళ్లు మరింత ఎక్కువ బాధను అనుభవిస్తుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. 1983లో భారత్‌కు మొట్టమొదటి వరల్డ్ కప్‌ను అందించిన నాటి జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ టీమిండియా ఆటగాళ్లకు ఓదార్పూనిస్తూ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చాడు.

"క్షమించండి, నేటి క్రికెటర్లు వరల్డ్ కప్‌ను గెలవలేకపోయారు. కానీ టోర్నీలో చాలా బాగా ఆడారు. గెలుపే సర్వస్వమని మన మనసుల్లో ఉంటుందని నాకు తెలుసు. కానీ ఆడిన విధానం మరింత ముఖ్యం. ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ఇక్కడికి వచ్చి ఆడారు. చివరి రోజున వాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన చేశారు. దానిని మనం గౌరవించాలి. టీమిండియా ఆటగాళ్లు ఇంత బాగా ఆడినా ట్రోఫీని గెలవలేకపోవడం నన్ను నిరాశ, నిరుత్సాహానికి గురిచేసింది. అయితే ఇది అంతగా పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఈసారి మనం అర్థం చేసుకోలేకపోయిన పొరపాట్ల నుంచి నేర్చుకుని ఇంకా మెరుగ్గా రాణిస్తామని ఆశిద్దాం. మనం ఆ పయనంలోనే ఉన్నాం’’ అంటూ కపిల్ దేవ్ సందేశమిచ్చాడని ‘స్పోర్ట్‌స్టార్’ పేర్కొంది.

కాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ(47), విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (3/55) చెలరేగి ఆడాడు. ఇక కెప్టెన్ పాట్ కమిన్స్ (2/34), జోష్ హేజిల్‌వుడ్ (2/60), ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్‌వెల్ చెరో వికెట్ తీసి భారత్‌ను కట్టడి చేశారు. ఇక 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. ట్రావిస్ హెడ్ (137), మార్నస్ లాబూషేన్(58) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.


More Telugu News