గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్సీకి హార్ధిక్‌పాండ్యా గుడ్‌బై.. మళ్లీ ముంబైకి స్టార్ ఆల్‌రౌండర్!

  • అరంగేట్ర టోర్నీలోనే గుజరాత్‌కు కప్ అందించిపెట్టిన హార్దిక్‌పాండ్యా
  • రూ. 15 కోట్లకు పాండ్యాను సొంతం చేసుకునేందుకు ముంబై స్కెచ్
  • అదే జరిగితే ఐపీఎల్ ట్రేడ్ విండో చరిత్రలోనే అతిపెద్ద ఆటగాళ్ల బదిలీ
ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిపెట్టిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీతోపాటు జట్టును కూడా విడిచిపెట్టేస్తున్నాడా? తిరిగి ముంబై ఇండియన్స్‌కు వచ్చేస్తున్నాడా? క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ జోరుగా సాగుతోంది. రూ. 15 కోట్లతో పాండ్యాను తిరిగి సొంతం చేసుకునేందుకు ముంబై ఇండియన్స్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. డిసెంబరు 9న జరగనున్న వేలంలో పాండ్యాను తిరిగి సొంతం చేసుకోబోతున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి.

ఈ నెల 26లోపు ఐపీఎల్ జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబరు 9 నుంచి వేలం ప్రారంభం అవుతుంది. 2015 నుంచి ముంబైకి ఆడుతున్న పాండ్యా 2021లో జట్టును విడిచిపెట్టాడు. 2022 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుక్కుని కెప్టెన్‌గా నియమించింది. ఆ సీజన్‌లో పాండ్యా జట్టుకు కప్ అందించిపెట్టాడు. 2023 ఎడిషన్‌లోనూ జట్టును ఫైనల్‌కు చేర్చాడు.  

హార్దిక్ ముంబైకి వెళ్తాడన్న ప్రచారం నిజమైతే ఐపీఎల్ ట్రేడ్ విండో చరిత్రలోనే అతిపెద్ద బదిలీ అవుతుంది. అంతేకాదు, జట్టును విడిచిపెట్టిన మూడో కెప్టెన్ అవుతాడు. అంతకుముందు అజింక్య రహానే రాజస్థాన్ రాయల్స్ నుంచి ఢిల్లీ కేపిటల్స్‌కు, రవిచంద్రన్ అశ్విన్ పంజాబ్ కింగ్స్ నుంచి ఢిల్లీ కేపిటల్స్‌కు వెళ్లారు.


More Telugu News