నేడు ఉత్తరప్రదేశ్‌లో ‘నో నాన్ వెజ్ డే’.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం

  • సాధు టీఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని ఆచరణ
  • మాంసం దుకాణాలు, కబేళాలు మూసివేత
  • ప్రకటన చేసిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు
ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 25న(శనివారం) ‘నో నాన్ వెజ్ డే’గా ప్రభుత్వం ప్రకటించింది. సాధు టీఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని ఆచరించాలని పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మాంసం దుకాణాలతోపాటు కబేళాలను మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హలాల్ సర్టిఫికేషన్‌ కలిగియున్నఆహార పదార్థాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై ఇటీవల యూపీ ప్రభుత్వం నిషేధం విధించింది. అనంతరం రోజుల వ్యవధిలోనే తాజా ప్రకటన రావడం గమనార్హం. ఇప్పటికే సాధు వాస్వానీ జయంతి నవంబర్ 25న అంతర్జాతీయ మాంసరహిత దినోత్సవంగా గుర్తించారు.

సాధు తన్వర్‌దాస్ లీలారామ్ వాస్వానీ భారతీయ విద్యావేత్తగా విశిష్ట గుర్తింపు పొందారు. విద్యారంగంలో ‘మీరా ఉద్యమాన్ని’ ప్రారంభించింది ఆయనే. సెయింట్ మీరా స్కూల్‌ని స్థాపించారు. ప్రస్తుతం ఈ స్కూల్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న హైదరాబాద్‌లో ఉంది.


More Telugu News