హీరోగా పరిచయం అవుతున్న విజయ్ సేతుపతి కుమారుడు

  • గతంలో పలు చిత్రాల్లో నటుడిగా కనిపించిన సూర్య
  • ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో సూర్య హీరోగా ఫీనిక్స్ చిత్రం
  • హీరోగా ఇదే తొలి చిత్రం
  • తండ్రి నీడలో కాకుండా సొంతంగా ఎదగాలనుకుంటున్నట్టు సూర్య వెల్లడి
సినీ రంగంలో వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణమైన విషయమే. అయితే, తమిళ నటుడు విజయ్ సేతుపతి కుమారుడు సూర్య హీరోగా పరిచయం అయ్యే క్రమంలో, తండ్రి పేరు చెప్పుకుని ఎదగాలని తాను భావించడంలేదని స్పష్టం చేయడం ద్వారా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. 

సూర్య... ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. అనల్ అరసుకు కూడా దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఈ సినిమా పేరు ఫీనిక్స్. యాక్షన్, స్పోర్ట్స్, డ్రామా... ఇలా అనేక ఎలిమెంట్లతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రాన్ని బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. 

ఈ సినిమా షూటింగ్ నేడు చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా సూర్య మాట్లాడుతూ, తన తండ్రి విజయ్ సేతుపతి నీడలో ప్రస్థానం సాగించాలని తాను కోరుకోవడంలేదని, తనకంటూ ప్రత్యేకమైన పంథా ఏర్పరచుకోవాలనుకుంటున్నానని తెలిపాడు. అందుకే తన పేరును సూర్య విజయ్ సేతుపతి అని కాకుండా, కేవలం సూర్య అని మాత్రమే ఫిలిం మేకర్స్ పేర్కొంటున్నారని వివరించాడు. తాను హీరోగా పరిచయం అవుతుండడం పట్ల తన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని సూర్య పేర్కొన్నాడు. 

సూర్యకు హీరోగా ఇదే తొలి చిత్రం అయినా, నటుడిగా ఇంతకుముందు పలు చిత్రాల్లో కనిపించాడు. విజయ్ సేతుపతి చిత్రాలు నేనూ రౌడీనే, సింధుబాద్ చిత్రాల్లో నటించిన సూర్య... కొత్త చిత్రం విడుదలై: పార్ట్ 2లో గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు. 

ఇక, సూర్యను హీరోగా పరిచయం చేస్తున్న అనల్ అరసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనల్ అరసు తెలుగులో జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, బ్రూస్ లీ, జై లవకుశ వంటి చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా వ్యవహరించారు. షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం జవాన్, కార్తీ నటించిన జపాన్ చిత్రాలకు కూడా అనల్ అరసు స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.


More Telugu News