బీజేపీ అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తాం: రాజ్‌నాథ్ సింగ్

  • మేడ్చల్ నియోజకవర్గం కీసరలో రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం
  • కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న కేంద్రమంత్రి
  • కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపణ
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని, తాము అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని విచారించి జైలుకు పంపిస్తామని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం ఆయన మేడ్చల్ నియోజకవర్గం కీసరలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారంలోకి రాకముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికీ గుజరాత్ దేశానికి మోడల్‌గా నిలిచిందని, కానీ కోటి ఆశలతో తెచ్చుకున్న తెలంగాణను అప్పులపాలు చేశారని మండిపడ్డారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఇక్కడ ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ప్రశ్నించారు.

వాజ్‌పేయి నుంచి నరేంద్రమోదీ వరకు బీజేపీ నాయకులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమన్నారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ముఖ్యమంత్రి పదవి హామీని పక్కన పెట్టారని, దళితబంధు హామీని కూడా నెరవేర్చలేదన్నారు.


More Telugu News