పీవీ నరసింహారావు అంటే సోనియా గాంధీకి ఎంతో గౌరవం: హుస్నాబాద్ సభలో ప్రియాంకగాంధీ

  • తమ తండ్రి చనిపోయినప్పుడు ఆయన తమ కుటుంబానికి అండగా నిలిచారన్న ప్రియాంక
  • కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా? అని నిలదీత
  • బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటేనని విమర్శ
తమ తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పీవీ నరసింహారావు తమ కుటుంబానికి అండగా నిలిచారని, అలాంటి వ్యక్తి అంటే సోనియా గాంధీకి ఎంతో గౌరవమని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ గడ్డ నుంచి వచ్చిన పీవీ అంటే తమకు గౌరవమని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేశారా? ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం వచ్చిందా? కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా? అని నిలదీశారు.

ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలరా? ఇలాంటి ప్రభుత్వం మీకు మరో అయిదేళ్లు కావాలా? అని ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యాడని, తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చాడని విమర్శించారు. కానీ ప్రజలు మాత్రం తమ పిల్లల్ని కష్టపడి చదివించుకున్నా పేపర్ లీకేజీల కారణంగా ఆ చదువులు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి కుటుంబం కోసమే పని చేస్తోందని ధ్వజమెత్తారు. దళితులు, గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. పెద్ద ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారన్నారు. రైతు రుణమాఫీని ఈ ప్రభుత్వాలు మరుగున పడేశాయన్నారు.

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిత్యం రాహుల్ గాంధీని విమర్శిస్తుంటారని, కానీ ప్రధాని మోదీ గురించి ఒక్క మాట మాట్లాడరని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒకటేనన్నారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకదానికొకటి అండగా ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పోటీ చేసే మజ్లిస్ పార్టీ తెలంగాణలో మాత్రం పది స్థానాల్లో కూడా పోటీ చేయడం లేదని విమర్శించారు. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. మోదీ పాలనలో ధనికులు తప్ప పేదలకు మేలు జరగడం లేదన్నారు.


More Telugu News