అన్నవరం, సింహద్రి అప్పన్న ఆలయాల్లో టీమిండియా కోచ్ ప్రత్యేక పూజలు

  • నిన్న విశాఖలో టీమిండియా-ఆసీస్ తొలి టీ20
  • విజయం సాధించిన టీమిండియా
  • నేడు సింహాద్రి అప్పన్న, అన్నవరం సత్యదేవుని ఆలయాలను సందర్శించిన లక్ష్మణ్
టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ వివిధ పుణ్యక్షేత్రాల్లో సందడి చేశారు. ఆయన ఇవాళ అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయాన్ని, సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయా పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రెండు చోట్ల దర్శనం చక్కగా జరిగిందని లక్ష్మణ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలను వీవీఎస్ లక్ష్మణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

కాగా, రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం వన్డే వరల్డ్ కప్ తో ముగిసింది. ద్రావిడ్ తిరిగి టీమిండియా కోచ్ బాధ్యతల్లో కొనసాగేందుకు విముఖత చూపుతుండడంతో, బీసీసీఐ లక్ష్మణ్ వైపు చూస్తోంది. లక్ష్మణ్ ఇప్పటికే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీపీ) హెడ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్ని సిరీస్ లలో టీమిండియాకు కోచ్ గానూ వ్యవహరించారు. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కు కూడా లక్ష్మణే టీమిండియా కోచ్. త్వరలోనే టీమిండియా పూర్తిస్థాయి కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


More Telugu News