బీఆర్ఎస్ ప్రభుత్వం యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టింది: పాలకుర్తి సభలో ప్రియాంక గాంధీ మండిపాటు

  • కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నారు.. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని ఎద్దేవా
  • పేపర్ లీకేజీలను అరికడతామన్న ప్రియాంక గాంధీ
  • కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన
'నా కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు... మీ ఇంటి పనులు వదులుకొని మరీ వచ్చారు... మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా' అని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ... కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నారని, ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలని నినదించారు. కేసీఆర్ తాను ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మీ ఓటు చాలా విలువైనదని... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల త్యాగాల వల్లే తెలంగాణ ఏర్పడిందని, అలాంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాము భావించామన్నారు. కానీ ప్రజల ఆకాంక్షలు ఈ పదేళ్ల కాలంలో నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరాయా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయని హామీ ఇచ్చారు. ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? అని ప్రశ్నించారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షులు లీక్ కావడంతో యువతను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

పేపర్ లీకేజీలను అరికడతామని ప్రియాంక గాంధీ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం వక్రీకరించిందని విమర్శించారు. ప్రతి మహిళ ఖాతాలో రూ.2500 వేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రూ.500కు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతుకు ఏడాదికి రూ.15 వేలు, వరికి కనీస మద్దతుతో పాటు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిందన్నారు. యువకుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారు.


More Telugu News