గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • గవర్నర్ బిల్లులను తొక్కిపెడుతున్నారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పలు రాష్ట్రాలు
  • ఈ నెల 10న పంజాబ్ గవర్నర్ అంశంపై సుప్రీం తీర్పు
  • తీర్పు ప్రతిని తాజాగా సుప్రీంకోర్టు వెబ్ సైట్లో పొందుపరిచిన అధికారులు
అసెంబ్లీ సిఫారసు చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారని పంజాబ్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పంజాబ్ గవర్నర్ అంశంపై నవంబరు 10న తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రతిని తాజాగా సుప్రీంకోర్టు వెబ్ సైట్లో పొందుపరిచారు. ఈ తీర్పులో సుప్రీం ధర్మాసనం గవర్నర్ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. 

"గవర్నర్ ఎన్నికల ప్రక్రియ ద్వారా పదవిని చేపట్టకపోయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా కొన్ని అధికారాలు ఉంటాయి. అయితే, ఆ అధికారాలకు పరిమితి ఉంది. అసెంబ్లీలు రూపొందించిన చట్టాలను అడ్డుకునే అధికారం గవర్నర్ కు లేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా వాటిని పెండింగ్ లో ఉంచే అధికారం గవర్నర్ కు ఉండదు. రాష్ట్రపతి నియమించే గవర్నర్ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి మాత్రమే. పాలనా పరమైన నిర్ణయాలను గవర్నర్ తీసుకోలేడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకే పాలనా పరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గవర్నర్ మార్గదర్శిగా మాత్రమే వ్యవహరించాలి. ప్రజాస్వామ్య సుస్థిరతకే ఇదే పునాది" అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.


More Telugu News