తెలంగాణను మోసం చేసిందే కాంగ్రెస్!: కేసీఆర్

  • అయిదేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచన
  • అభ్యర్థులు, పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలన్న కేసీఆర్
  • బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని వ్యాఖ్య 
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ వాళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, తనను గెలిపిస్తే.... ఎన్నికలయ్యాక బీఆర్ఎస్‌లో చేరుతామని ఆ పార్టీ అభ్యర్థులు చెబుతున్నారట.. కానీ అదంతా ఝూటా ముచ్చట (అబద్దం) అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ... తనను గెలిపిస్తే బీఆర్ఎస్‌లో చేరుతానని ఇక్కడ నాయకుడు కూడా చెబుతున్నాడట.. నాకు వార్త వచ్చింది... కానీ అదేం లేదు, అంతా అబద్ధమని సభికులను ఉద్దేశించి చెప్పారు. మీ వద్ద కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే మీ వాడకట్టుకో పేకాట క్లబ్ వస్తుందని, అప్పుడు మంచిర్యాల మొత్తం పేకాట క్లబ్బులు తయారవుతాయని హెచ్చరించారు. అప్పుడు ఇళ్లు అమ్ముకొని పేకాటలో పెట్టాల్సి వస్తుందని, జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. 

అయిదేళ్ల భవిష్యత్తు బాగుపడాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు ఉండేవని ఆరోపించారు. గోదావరి మన ఒడ్డునే ఉన్నా కాంగ్రెస్ పార్టీ నీళ్లివ్వలేకపోయిందని విమర్శించారు. 1969లో కాంగ్రెస్ నాలుగు వందల మంది ఉద్యమకారులను కాల్చి చంపిందని, మలి దశ ఉద్యమంలో టీఆర్ఎస్‌ను చీల్చే ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు.

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ పెంచుతామన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, రైతుబంధు కూడా పెంచుతామన్నారు. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆగం కావొద్దని, పార్టీలు, అభ్యర్థుల చరిత్ర చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మోసం చేసిందే కాంగ్రెస్ అని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని వ్యాఖ్యానించారు.


More Telugu News