వృద్ధుడి పెద్దపేగులో ఈగ.. ఎలా వెళ్లిందో తెలియక బుర్రలు బద్దలుగొట్టుకుంటున్న శాస్త్రవేత్తలు!

  • కొలొనోస్కోపీ కోసం ఆసుపత్రికి 63 ఏళ్ల వృద్ధుడు
  • పెద్దపేగులో జీర్ణం కాకుండా నిక్షేపంలా ఉన్న ఈగ
  • ఎలా వెళ్లి ఉంటుందన్న దానిపై చేసిన రెండు సిద్ధాంతాలూ తప్పే
  • మరెలా వెళ్లి ఉంటుందన్న దానిపై తర్జనభర్జనలు
రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఆసుపత్రికి వెళ్లిన 63 ఏళ్ల వృద్ధుడి పెద్దపేగులో ఈగను చూసిన వైద్యులు షాకయ్యారు. అమెరికాలోని మిస్సౌరీలో జరిగిందీ ఘటన. కొలొనోస్కోపీ కోసం వెళ్లిన వృద్ధుడికి వైద్యులు పరీక్షలు చేశారు. కొలొనోస్కోపీ ప్రక్రియలో ఓ ప్లెక్సిబుల్ ట్యూబ్‌కు కెమెరా, లైట్ అమర్చి పెద్దపేగులోకి పంపించి వాటిని పరీక్షిస్తారు. ఈ క్రమంలో వారికి ఓ చోట చనిపోయినా చెక్కుచెదరకుండా ఉన్న ఈగ కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని రోగికి చెప్పడంతో అతడు ఆశ్చర్యపోయాడు. వైద్యులు సూచించినట్టుగా కొలొనోస్కోపీకి ముందు తాను ద్రవాహారం మాత్రమే తీసుకున్నానని, భోజనంగా పిజ్జా, పాలకూర తిన్నానని పేర్కొన్నాడు. అనుకోకుండా ఈగను మింగినట్టు తనకు గుర్తులేదని చెప్పుకొచ్చాడు.  

ఈగ అతడి పెద్దపేగులోకి ఎలా చేరిందన్న దానిపై మిస్సౌరీ విశ్వవిద్యాలయ గ్యాస్ట్రో ఎంటరాలిజిస్ట్ చీఫ్ మాథ్యూ బెచ్‌టోల్డ్ రెండు సిద్ధాంతాలను సూత్రీకరించారు. అందులో మొదటిది.. ఈగ మనిషి నోటి ద్వారా పెద్ద పేగులకు చేరుకుని ఉంటుంది. అయితే, సాధారణ పరిస్థితుల్లో ఎగువ జీర్ణ ఎంజైములు పొట్టలోని ఆమ్లం ఈగని జీర్ణం చేసుకుని ఉండాలి. అలా జరగలేదు కాబట్టి నోటి ద్వారా ఈగ లోపలికి ప్రవేశించలేదు. 

రెండో సిద్ధాంతం ప్రకారం.. పురీషనాళం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చు. ఈ సిద్ధాంతం కూడా తప్పే. దిగువ నుంచి పెద్దపేగులోకి ఈగ జొరబడడం అసాధ్యం. ఎందుకంటే ఈగ అంతదూరం ప్రయాణించాలంటే అది పొడవుగా తెరుచుకుని ఉండాలి. కానీ, పెద్దపేగు మధ్యలో ముడుచుకుని వంకరగా ఉంటుంది. కాబట్టి ఈ సిద్ధాంతం కూడా తప్పే. 

జీర్ణవ్యవస్థలో కీటకాలు చెక్కుచెదరకుండా ఉండి గుడ్లు లేదంటే లార్వాలను జీర్ణాశయాంతర పేగులలో ఉంచి పేగు మయాసిస్‌కు కారణమయ్యే సందర్భాలు గతంలోనూ అరుదుగా ఉన్నట్టు అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పేర్కొంది. పిన్‌వార్మ్, సీట్‌వార్మ్, థ్రెడ్‌వార్మ్‌ వంటి పరాన్నజీవులు పేగులను ప్రభావితం చేసిన సందర్భాలు కూడా ఉన్నప్పటికీ పేగుల్లో జీర్ణం కాని ఈగను గుర్తించడం ఇదే తొలిసారి. అది లోపలికి ఎలా ప్రవేశించి ఉంటుందంటూ చేసిన సిద్ధాంతాలన్నీ తప్పు కావడంతో మరి అది ఎలా ప్రవేశించిందన్నది శాస్త్రవేత్తలకు సవాలుగా మిగిలింది.


More Telugu News