తప్పించుకు తిరిగేందుకు జగన్ అర్హుడైతే.. పిల్ వేసేందుకు నేను కూడా అర్హుడినే: రఘురామకృష్ణరాజు

  • ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని రఘురామరాజు పిటిషన్
  • జగన్ సహా 41 మందికి నోటీసులిచ్చిన ఏపీ హైకోర్టు
  • పిల్ వేసేందుకు రఘురామరాజుకు అర్హత లేదన్న ఏజీ శ్రీరామ్
  • శ్రీరామ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న రఘురామరాజు 
  • 11 ఛార్జ్ షీట్లలో జగన్ నిందితుడిగా ఉన్నారని వ్యాఖ్య
ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని, సంక్షేమ పథకాల మాటున అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ముఖ్యమంత్రి జగన్ సహా 41 మందికి హైకోర్టు నోటీసులు పంపించింది. విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... పిటిషన్ వేసేందుకు రఘురాజుకు అర్హత లేదని అన్నారు. 

ఈ నేపథ్యంలో ఏజీ శ్రీరామ్ పై రఘురామరాజు విమర్శలు గుప్పించారు. 11 ఛార్జ్ షీట్లలో నిందితుడైన జగన్ పదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారని... అలాంటి జగన్ సీఎం పదవికి అర్హుడైనప్పుడు, పిల్ వేసేందుకు తాను కూడా అర్హుడినే అని అన్నారు. తనపై శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. జగన్ పై సీబీఐ రూ. 43 వేల కోట్ల ఆర్థిక నేరాల అభియోగాలను నమోదు చేసిందని అన్నారు. కోర్టుకు హాజరు కాకుండా జగన్ తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. 

తాను వైసీపీ ఎంపీనని తప్పుడు ధ్రువీకరణపత్రం ఇచ్చినట్టు శ్రీరామ్ అన్నారని... ఇది మరింత ఆశ్చర్యకరంగా ఉందని రఘురాజు అన్నారు. తనను ఇంకా వైసీపీ నుంచి సస్పెండ్ చేయలేదనే విషయాన్ని శ్రీరామ్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి తనను బహిష్కరించాలని తొలుత జగన్ కు సలహా ఇవ్వాలని... ఆ పని చేస్తే సాధారణ ఎంపీగా ధ్రువీకరణపత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. తనను లాకప్ లో వేసి చిత్రహింసలకు గురి చేశారని... అయినా తన మిత్రుడి కొడుకైన జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు.


More Telugu News