బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాయావతి తీవ్ర విమర్శలు
- బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
- సిర్పూర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి
- బీఎస్పీ అధికారంలోకి వస్తే భూపంపిణీ చేస్తామని హామీ
బీఆర్ఎస్‌పై బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. ఆమె గురువారం పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూపంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో బీఎస్పీ గుర్తు ఏనుగుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.