విశాఖలో ప్రభుత్వ శాఖల క్యాంపు కార్యాలయాలకు భవనాల కేటాయింపు

  • విశాఖ రాజధాని దిశగా చర్యలు ముమ్మరం చేసిన ఏపీ సర్కారు
  • ప్రభుత్వ కార్యాలయ భవనాల కోసం 2.27 లక్షల చదరపు అడుగులు కేటాయింపు
  • 35 శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వుల జారీ
విశాఖకు రాజధాని తరలింపు వ్యవహారంలో ఏపీ సర్కారు వేగం పెంచింది. విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయించింది. 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు కేటాయిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిక కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక, గ్రామ వార్డు సచివాలయ శాఖ, ఇంధన శాఖ మినహా... 35 శాఖలకు విశాఖలో భవనాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు ఆంధ్రా యూనివర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలో భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి కొన్ని శాఖలకు ఎండాడ, హనుమంతువాక ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. 

మంత్రులు, ఉన్నతాధికారులు, శాఖల కార్యదర్శులకు కార్యాలయాలు, విడిది అవసరాలకు సైతం భవనాలు కేటాయించారు. విశాఖలోని మిలీనియం టవర్స్ లోని ఏ, బీ బ్లాకులను కూడా కేటాయించారు. కాగా, అన్నిటికంటే ముఖ్యమైన సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడో ఈ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.


More Telugu News