కదలనీయకుండా చేసే క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో అందుబాటులో!

  • ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా వచ్చిన 'కన్నై నంబాదే'
  • థియేటర్లలో వచ్చిన మిక్స్డ్ టాక్ 
  • 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులో ఉన్న తెలుగు వెర్షన్
  • మొదటి నుంచి చివరివరకూ ఆకట్టుకునే సినిమా

తమిళంలో ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఉదయ్ నిధి స్టాలిన్ నటించిన 'కన్నై నంబాదే' ఒకటిగా కనిపిస్తుంది. మార్చి 17వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత ఏప్రిల్ 14వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. స్క్రీన్ పై తమిళ టైటిల్ తోనే ఈ సినిమా కనిపించినప్పటికీ, తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఉదయనిధి స్టాలిన్ కి ఇక్కడ అంత క్రేజ్ లేకపోవడం వలన కొంతమంది ఈ సినిమా వైపు రిమోట్ తిప్పకపోవచ్చు. కానీ ఒకసారి సినిమాలోకి ఎంటరైతే పూర్తిగా చూడకుండా ఉండరు. 

రంజిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి 'మారన్' దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా నడుస్తుంది. మంచితనం మాత్రమే తెలిసిన ఒక యువకుడు తనకి తెలియకుండానే ఒక వైపున హత్య కేసులోను .. మరో వైపున యాక్సిడెంట్ కేసులోను .. ఇంకో వైపున కిడ్నాప్ కేసులోను చిక్కుకుంటాడు. ఎలా ఆ ఉచ్చులో అతను చిక్కుకున్నాడు? అందుకు కారకులు ఎవరు? ఆ వలయంలో నుంచి తనంతట తానుగా ఎలా బయటపడ్డాడు? అనేదే కథ. 

కథ చాలా సింపుల్ గా .. సాదా సీదాగా మొదలవుతుంది. అందువలన ఒక పావుగంట వెయిట్ చేస్తే అసలు కథ మొదలవుతుంది. నిదానంగా కథ చిక్కబడుతూ వెళుతుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుంది. మొదటి నుంచి చివరివరకూ కూడా కథ ఎక్కడా పలచబడదు. అనేక మలుపులు తిరుగుతూ .. ఆసక్తికరంగా ముందుకు వెళుతుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఉదయ్ నిధి స్టాలిన్ .. ప్రసన్న .. శ్రీకాంత్ (శ్రీరామ్) ఆత్మిక .. భూమిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, చూడటానికి కేటాయించిన సమయాన్ని వృథా చేయదు. ఇంతవరకూ చూడనివారు చూడొచ్చు.


More Telugu News