ఈ పని చేయకపోతే బీసీలను ఇక ఏ పార్టీ నమ్మదు: బండి సంజయ్

  • బీసీని సీఎం చేస్తానని మోదీ హామీ ఇచ్చారన్న బండి సంజయ్
  • రాష్ట్రంలో 50 శాతం మంది ఉన్న బీసీలు బీజేపీకి ఓటు వేయాలని విన్నపం
  • నిరుద్యోగులను కేటీఆర్ తిట్టారని మండిపాటు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆ పార్టీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గుర్తు చేశారు. రాష్ట్రంలో 50 శాతం ఉన్న బీసీలు బీజేపీకి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతాడని చెప్పారు. బీసీలు బీజేపీకి ఓటు వేయకపోతే ఏ ఇతర పార్టీలు బీసీలను నమ్మవని అన్నారు. ప్రజల కోసం పోరాడిన దాదాపు 5 వేల మంది బీజేపీ కార్యకర్తలపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారని విమర్శించారు. తనపై కూడా 74 కేసులు పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై భూకబ్జా, 420 కేసులు ఉన్నాయని చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్ పై అక్రమ సంపాదన, గ్రానైట్ కేసులు ఉన్నాయని అన్నారు. 

ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన నిరుద్యోగులను కేటీఆర్ తిట్టారని మండిపడ్డారు. కేటీఆర్ కండకావరమెక్కి మాట్లాడుతున్నాడని... దవడ పళ్లు రాలగొడితే సరి అని అన్నారు. అరిగిన రబ్బర్ చెప్పులు, మడతల చొక్కా వేసుకున్న నీ గతాన్ని ఒక సారి గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ను కేసీఆర్ సీఎంను చేస్తారని... అప్పుడు కవిత, హరీశ్ రావు, సంతోష్ కుమార్ ఊరుకోరని... వాళ్లంతా తలో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లిపోతారని... అప్పుడు ప్రభుత్వం ఉంటుందా? అని ప్రశ్నించారు.


More Telugu News