చైనాలో అంతుబట్టని మరో మహమ్మారి?.. అసాధారణంగా పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లలు!

  • ప్రభావిత పిల్లల్లో ఊపిరితిత్తుల వాపు, తీవ్రమైన జ్వరం, అసాధారణ లక్షణాలు
  • రోగులతో కిటకిటలాడుతున్న బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్‌లలోని హాస్పిటల్స్
  • స్కూళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్న చైనా మీడియా వర్గాలు
కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం తేరుకుంటున్న వేళ కరోనా పుట్టిల్లు చైనాలో మరో కొత్త వైరస్ అలజడి రేపుతోంది. చైనా స్కూళ్ల ద్వారా గుర్తించని ఒక న్యుమోనియా వ్యాప్తి చెందుతోంది. ఊపిరితిత్తుల వాపు, తీవ్రమైన జ్వరంతోపాటు అసాధారణ లక్షణాలు పిల్లల్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే సాధారణ దగ్గు, ఫ్లూ, ఆర్ఎస్‌వీ, ఇతర శ్వాసకోశ వ్యాధుల లక్షణాలు లేవని అంటున్నారు. 

ఈ వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల సంఖ్యను చూస్తుంటే కొవిడ్-19 నాటి పరిస్థితులు గుర్తుకు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి పట్ల చైనా ఆరోగ్య వ్యవస్థ కలవరం చెందుతోంది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పిల్లలు అనారోగ్యానికి గురవ్వడంతో తల్లిదండ్రులు హాస్పిటల్స్‌కు తీసుకెళ్తున్నారు. రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో బీజింగ్, లియానింగ్‌ ప్రావిన్స్‌లలోని ఆసుపత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రుల వనరులు అడుగంటే స్థితికి చేరుకుంటున్నాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కొత్త రకం న్యుమోనియా వ్యాప్తి కారణంగా పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా మనుషులు, జంతువులలో వ్యాధుల వ్యాప్తిని గుర్తించే ఓపెన్-యాక్సెస్ నిఘా ప్లాట్‌ఫారమ్ ‘ప్రోమెడ్’ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా ఇంకా నిర్ధారించని న్యుమోనియా పిల్లలను ప్రభావితం చేస్తోందని మంగళవారం అప్రమత్తత ప్రకటించింది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందని తెలిపింది. న్యూమోనియా విస్తృతంగా సోకుతోందని, వ్యాపించడం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా చెప్పలేమని ప్రోమెడ్ రిపోర్ట్‌లో పేర్కొంది. చాలా మంది పిల్లలు ఇంత త్వరగా ప్రభావితం కావడం అసాధారణమని వివరించింది. అయితే ఈ వైరస్ పెద్దలకు కూడా వ్యాపిస్తోందా? లేదా? అనేది పేర్కొనలేదు. ఇది మరొక మహమ్మారి అని అంచనా వేయడం తొందరపాటే అవుతుందని, అయితే వైరాలజిస్ట్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించింది.

 కాగా కరోనాకు ముందు కూడా ‘ప్రోమెడ్’ ఇదే విధంగా హెచ్చరించింది. వైరస్ వ్యాపించకముందే డిసెంబర్ 2019 చివరలో ఒక రిపోర్ట్ ద్వారా హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలోని వివిధ ఉన్నత స్థాయి అధికారులతోపాటు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత దానిని కరోనాగా గుర్తించారు. ప్రపంచం మొత్తం ఏ విధంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే.


More Telugu News