ఇందిరాగాంధీని కూడా కేసీఆర్ తిడుతున్నారు: మల్లికార్జున ఖర్గే ఆవేదన

  • మోదీ, కేసీఆర్ ఒక్కటే.. వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవన్న ఖర్గే
  • పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ ఏం చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఖర్గే
  • నాగార్జున సాగర్ లేకుంటే తెలంగాణ ఎక్కడిదని ప్రశ్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరాగాంధీని కూడా తిడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కటేనని విమర్శించారు. వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవన్నారు. ఇందిరాగాంధీని కేసీఆర్ తిట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఏం చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లేకుంటే తెలంగాణ ఎలా ఉండేదని ప్రశ్నించారు.

దేశంలో ఆహార కొరత తీర్చింది ఇందిరమ్మే అన్నారు. హరిత విప్లవం వల్లే తెలంగాణలో ఆహార కొరత తీరిందని వెల్లడించారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? అని ప్రశ్నించారు. రైతులకు, పేదలకు, దళితులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం అన్నారు. గాంధీ కుటుంబం ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికపై కుట్ర చేశారన్నారు.


More Telugu News