ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో గాంధీ భవన్ రిమోట్: అసదుద్దీన్ ఓవైసీ

  • కాంగ్రెస్ పార్టీ కారణంగానే కేంద్రంలో బీజేపీ గెలుస్తోందని విమర్శలు
  • రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తో ప్రారంభమైందన్న అసదుద్దీన్
  • బీజేపీతో తమ పోరాటం సాగుతుందని స్పష్టీకరణ 
నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం... గాంధీ భవన్ రిమోట్ ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కారణంగానే కేంద్రంలో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ తనను బాధ్యుడిగా చెబుతోందని, కానీ ఆ పార్టీ విజయం సాధిస్తే తాను ఎలా బాధ్యుడిని అవుతాను? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా... బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన చోట మజ్లిస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామన్నారు. తమ ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు.


More Telugu News